తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సందర్శించి, ఆసుపత్రిలో పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్న అనంతరం, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఎంహెచ్‌ఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, “పొద్దున లేస్తే ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, పేదలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇది ప్రజా పాలనా? రాక్షస పాలనా?” అని ప్రశ్నించారు. రోజంతా కష్టపడి కూలి పనులు చేస్తే వచ్చే రూ.500తో కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పేద ప్రజలు, అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ మందులు, సెలైన్ బాటిళ్లు అందుబాటులో లేక ప్రైవేట్ మెడికల్ షాపుల్లో సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన పేదలు మందుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో పేదలకు కనీస వైద్య సదుపాయాలు అందకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాకు పర్యటనలకు రావడం మాత్రమే కాకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రధాన డిమాండ్లు: - కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో అవసరమైన మందులు, టాబ్లెట్లు, సెలైన్ బాటిళ్లను తక్షణమే అందుబాటులో ఉంచాలి. - పేద పేషెంట్లు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సిన పరిస్థితిని నివారించాలి. - ఆసుపత్రిలో అవసరమైన వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. - పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, మంత్రుల పర్యటనలను అడ్డుకునే స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కనుకుంట్ల రాజమొగిలి, రాయుడు నాగేశ్వరరావు, ఆదిమూల రాములు, నోముల రమేష్, కొత్తూరు శ్రీనివాస్, రాజమొగిలి, గూడా విజయ, పట్టణ నాయకులు బొండుగుల యామిని, భూక్యా పూర్ణ, అగుళ్ల సుహాసిని, కలంకర్ రాజశేఖర్, భాస్కర్, గిరి, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ