తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శనివారం హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 42 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించిన ఎస్సై గద్దాడ శ్రీనివాసులు, 37 సంవత్సరాల పాటు సేవలందించిన ఏఎస్ఐ గుడగుంట్ల సుధాకర్, 36 సంవత్సరాల పాటు సేవలందించిన ఏఎస్ఐ రెంటపల్లి స్వామి పదవీ విరమణ పొందారు. వీరిని జిల్లా ఎస్పీ శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులు తమ సుదీర్ఘ పోలీసు సేవా అనుభవాలను, విధి నిర్వహణలో ఎదురైన అనుభవాలను తోటి అధికారులు, సిబ్బందితో పంచుకున్నారు. అదేవిధంగా వారితో కలిసి పనిచేసిన సందర్భాలను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో వారు అందించిన సేవలను, విధుల పట్ల చూపిన నిబద్ధతను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించాలని సూచించారు. పదవీ విరమణ పొందిన అధికారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, పదవీ విరమణ పొందుతున్న అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ