తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమగ్ర గ్రామాభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను గుర్తించి నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని, గ్రామాల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యచందన , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగలక్ష్మి, డి ఆర్ ఓ పద్మావతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజా అవసరాలు, ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ సమర్థవంతమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు . ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP), పంచాయతీ అడ్వాన్స్ ఇండికేటర్స్ (PAI), పీఏఐ సూచికలను జీపీడీపీతో అనుసంధానం చేయడం ద్వారా నాణ్యమైన గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించే విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు, పెసా గ్రామ పంచాయతీలు, సభాసర్, నిర్ణయ్ యాప్, ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ వినియోగంపై వివరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీలు ఉత్తమ పనితీరు కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విద్యచందన, పంచాయతీ కార్యదర్శి ఎం. సాయి, ఎంపీడీఓ సంకీర్త్, ఎంపీఓ వీరారెడ్డి, ఎంపీఓ సంధ్య శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత జిల్లా అధికారులు, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్ల డీఎల్‌పీఓలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ