తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి.ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించి పనులను సమన్వయం చేయాలి డిసెంబర్ నాటికి ఉత్తర ద్వార దర్శనం పనులతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి శ్రీరామనవమి నాటికి 90 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేయాలి : దేవాదాయ కమిషనర్ హనుమంతరావు గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుష్కరాల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాదాయ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని అన్నారు. దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, పోలీస్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాల వారీగా మంజూరైన పనుల పురోగతి, వివిధ అనుమతులు, ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించి, అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి దేవాలయాల అభివృద్ధి, పుష్కర పనులు, పర్యాటక అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల పనులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు త్వరలో ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్లు, ప్రతి వారం పనుల వివరాలను యాప్‌లో అప్‌డేట్ చేయాలని తెలిపారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దేవాదాయ కమిషనర్ సూచించారు. డిసెంబర్ నాటికి ఉత్తర ద్వార దర్శనం పనులతో పాటు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీరామనవమి నాటికి 90 శాతం పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను దేవాదాయ కమిషనర్ వివరించారు. ఇరిగేషన్, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపడుతున్న శాశ్వత పనులతో పాటు చేపట్టనున్న తాత్కాలిక పనులపై సమీక్షించారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, రాకపోకల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లాలో చేపడుతున్న అన్ని పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులు, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. డిసెంబర్‌లో ఉత్తర ద్వార దర్శనం, ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీరామనవమి నాటికి 90 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, పుష్కరాల నాటికి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, డిఆర్ఓ పద్మావతి, సిపిఓ సునీత, దేవస్థానం ఈవో దామోదర్ రావు,డిపిఓ అనూష, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ