తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ములకలపల్లి మండలంలో పర్యటించి ములకలపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని అన్ని తరగతి గదులను సందర్శించి విద్యార్థుల హాజరు, బోధన పరిస్థితులను పరిశీలించారు. అలాగే వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, ఆహరపదార్దాల నాణ్యత,పాఠశాల ఆవరణలోని పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై ప్రత్యేకంగా ఆరా తీశారు.అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత ఏ కోర్సులు చదవాలని భావిస్తున్నారు, భవిష్యత్తులో ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కేజీవీబీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ–ఫైనల్ పరీక్షలను కూడా కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్న తీరు గమనించి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాబోయే పరీక్షలకు సమగ్రంగా సిద్ధం కావాలని సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్లో స్నాక్స్ అందించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉపయోగిస్తున్న పుస్తకాలను పరిశీలించి వారి రాత సామర్థ్యాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంట చేసే సమయంలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులందరి బాధ్యత అని అన్నారు. వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమర్థంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కేజీబీవీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహేశ్వరి, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీడీవో, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ అశోక్, పాఠశాలల బోధన బోధనేతర సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ