తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగానే ఎల్‌నినోను ఎదుర్కోవాలి.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనానికే జిల్లా సమీక్షా సమావేశాలు.అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టాలి.వర్షపాతం లోటుపై ప్రతి రైతుకు స్పష్టమైన సమాచారం చేరాలి.గతేడాది–ఈ ఏడాది నీటి లభ్యతపై నివేదిక విడుదల చేయాలి. నాగార్జునసాగర్, పాలేరు నుంచి ఈ ఖరీఫ్‌లో సాగునీరు లేదు.త్రాగునీటి అవసరాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రత్యామ్నాయ త్రాగునీటి వనరులను ముందుగానే సిద్ధం చేయాలి.రైతు వేదికల ద్వారా వాస్తవ పరిస్థితులను వివరించాలి.బోర్ల ఆధారంగా నీటి అధిక అవసరమున్న పంటలు వేయొద్దు.రాజీవ్ లింక్ కాలువ ద్వారా నీటి తరలింపుపై వెంటనే నివేదిక ఇవ్వాలి.ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, శాఖల సమన్వయంతోనే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్,ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులు, వర్ష పాతం, త్రాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్‌నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జూలై 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, రైతులు ప్రస్తుతం పత్తి అధికంగా సాగు చేశారని, వర్షాలు వస్తే వరి పంట వేద్దామని చూస్తున్నారని, భూగర్భ జలాలు గలవారు వరి పంట సాగుకు ముందుకు వెళ్తున్నారని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ భూగర్భ జలాలు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రెండు నెలల్లో మరింత తగ్గిపోతాయని, రైతులు ఎవరు వరి పంట సాగు చేయవద్దని ఆయన కోరారు.క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే జిల్లాల్లో సమీక్షా సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదల, ప్రణాళిక, వ్యవసాయ, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం లోటు ఎంత, దాని ప్రభావం ఏమిటనే అంశాలపై ప్రతి రైతుకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వం వద్ద ఉన్న వాస్తవ సమాచారం క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గత ఏడాది, ఈ ఏడాది నీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై వివరాలతో ప్రణాళిక శాఖ సమగ్ర నివేదిక సిద్ధం చేసి మీడియాకు, క్షేత్రస్థాయి అధికారులకు, రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించిన మేరకు రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చో అన్ని సాంకేతిక అవకాశాలను పరిశీలించి తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వర్షపాతం పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యతను బట్టి మాత్రమే రైతులు పంటల ఎంపిక చేసుకునేలా క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్‌లో సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, పాలేరు ఆయకట్టుకు కూడా సాగునీరు అందుబాటులో ఉండదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. వాస్తవ పరిస్థితులను దాచకుండా అధికారులు నేరుగా రైతులతో మాట్లాడాలని సూచించారు.ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో త్రాగునీటి అవసరాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా త్రాగునీటి వనరులు సరిపోని పరిస్థితి ఉంటే వెంటనే ప్రత్యామ్నాయ వనరులను గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాబోయే ఒక సంవత్సరం త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.భూగర్భ జలాల లభ్యత ఆధారంగా మాత్రమే పంటల ప్రణాళిక రూపొందించాలని, వరి వంటి నీటి అధిక అవసరమున్న పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని స్పష్టం చేశారు. పెసర, మినుములు, కందులు, అలసంద, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను మాత్రమే రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశము ఉన్నందున బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు, భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటువంటి తీవ్రమైన కరువు పరిస్థితులు దాదాపు 150 సంవత్సరాలకు ఒకసారి సంభవించే అవకాశం ఉన్నందున ప్రతి మండల స్థాయి అధికారి అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశముందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో విద్యుత్ సరఫరా పై కూడా ప్రభావం పడే అవకాశముందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడి నీటి అధిక అవసరమున్న పంటలను సాగు చేయకుండా రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు మౌనంగా ఉండకుండా వాస్తవ పరిస్థితులను రైతులకు స్పష్టంగా తెలియ జేయాలని, సమాచార ప్రసారంలో సమర్థవంతమైన విధానాన్ని అవలంబించాలని సూచించారు. నీటి లభ్యత లేని పరిస్థితుల్లో వరి సాగు చేస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేదనే పరిస్థితి రాకుండా ముందుగానే స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు. నీటి లభ్యత లేని పరిస్థితుల్లో వరి సాగు చేస్తే అది పూర్తిగా రైతుల సొంత బాధ్యతేనని స్పష్టమైన సందేశం క్షేత్రస్థాయిలో చేరాలని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధ్యమైనన్ని ప్రాంతాల్లో గోదావరి బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి చెరువులను నింపేందుకు అవసరమైన మోటార్లు, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేసి ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రస్తుతం గోదావరి నీటిని వినియోగించి చెరువులను నింపగలిగితే వచ్చే వేసవి వరకు త్రాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఖరీఫ్‌లో సాగునీటికి నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు ఎలా వినియోగించాలనే అంశంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.ప్రస్తుతం వైరా, లంకా సాగర్ జలాశయాలను త్రాగునీటి అవసరాల కోసమే నింపుతున్నా మని, పాలేరు జలాశయంలో కూడా సెప్టెంబర్-2026 వరకు మాత్రమే తాగునీటి నిల్వలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి నీటిని పాలేరు జలాశయానికి తరలించే అవకాశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను అవకాశంగా మలుచుకొని ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల పరిస్థితులకే పరిమితం కాకుండా కనీసం ఒక సంవత్సరం కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.ప్రతి మండలానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ప్రతి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాల, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో స్థానిక సమాచారాన్ని విశ్లేషించి మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి మండలానికి సంబంధించిన ధృవీకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించాలని తెలిపారు. మండల స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, జిల్లా స్థాయిలో సమగ్ర కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి వర్షపాతం, త్రాగునీటి పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 34 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది అని అన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు నీతో మాత్రమే ఆధారపడి ఉన్నాయని, కావున రైతుల్ని ఆయిల్ ఫామ్ సాగు కై అవగాహన కల్పిస్తున్నాం. అన్నారు.ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటికి ఉన్న అవకాశాలపై స్పష్టమైన సమాచారాన్ని సిద్ధం చేసాం అన్నారు . సొంత బోర్లు ఉన్న రైతుల వివరాలను సేకరించి, ముఖ్యంగా సత్తుపల్లి ప్రాంతంలో అధికంగా వరి సాగు జరుగుతున్నందున అక్కడ ప్రత్యేక దృష్టి సారించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో వరి సాగును నిరుత్సాహ పరుస్తూ కూరగాయల సాగును కూడా ప్రోత్సహిస్తున్నామని, అవసరమైన విత్తనాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం అధికారులకు అందుబాటులో ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న అన్ని నీటి నిల్వలు త్రాగునీటి అవసరాల కోసమేనని, సాగునీటి కోసం కాదనే విషయాన్ని రైతులకు స్పష్టంగా తెలియ జేయాలని సూచించారు. గోదావరి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేకపోవడం, భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్న పరిస్థితిని క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తిగా వివరించి, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రివర్యులు, జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ తెలంగాణ జలసిరి, ఎల్ నినో సూపర్ స్థితిలో తీసుకునే చర్యలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డి, సుడా చైర్‌పర్సన్ దుర్గా ప్రసాద్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌వో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ