తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం సాయంత్రం సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గోదావరి నీటి మట్టం మరింత పెరిగితే సారపాక–రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, ప్రజలు ఎవరూ ఆ మార్గంలో ప్రయాణించకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.అనంతరం తూరుబాక –దుమ్ముగూడెం ప్రధాన రహదారిని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఆ మార్గంపై ఇప్పటికే వరద నీరు చేరడంతో రాకపోకలను నిలిపివేసి రహదారిని మూసివేసినట్లు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రహదారి వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద నిరంతరం పోలీసు బందోబస్తు కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వరద నీటిలో ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ