తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువత ఆరోగ్యంపై అల్లు అర్జున్ అభిమానుల అవగాహన బాట.హెచ్‌పీవీ టీకాపై అవగాహన.. అధికారులతో పోస్టర్ ఆవిష్కరణ.యువత ఆరోగ్య పరిరక్షణతో పాటు హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ అభిమానుల సంఘం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన రెండో విడత హెచ్‌పీవీ టీకా అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి. రవిబాబులను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మతిన్ ఆధ్వర్యంలో అభిమానులు కలిసి హెచ్‌పీవీ టీకా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్ మాట్లాడుతూ హెచ్‌పీవీ వైరస్ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో హెచ్‌పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని, అర్హులైన పిల్లలు, యువత వైద్యుల సూచనల మేరకు టీకా తీసుకోవాలని సూచించారు. టీకాపై ఉన్న అపోహలను తొలగించుకుని శాస్త్రీయ అవగాహనతో ముందుకు రావాలని తెలిపారు. అభిమానులు కేవలం సినిమాలు చూడటం, అభిమాన నటుల చిత్రాలకు పాలాభిషేకాలు చేయడం వంటి కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజారోగ్యానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత తమ అభిమానాన్ని సామాజిక సేవతో ముడిపెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర అల్లు అర్జున్ అభిమానుల సంఘం అధ్యక్షులు అంజి యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం అల్లు అర్జున్ అభిమానుల సంఘం కమిటీ సభ్యులు హుస్సేన్, ముస్తఫా, రాహుల్, అశోక్, గుణసాయి, ఓంకార్, తేజ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ