తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి.తక్షణ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉందాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడిన నిరుపేద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కోరారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణం కారకవాగు పరిధిలో మొహమ్మద్ ముబీన్ ఏహ్మద్ నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు, లక్ష రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, విలువైన ధ్రువీకరణ పత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, సర్వస్వం బూడిదై కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలి దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దగ్ధమైన ఇంటిని, సామగ్రిని పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ నిరుపేద కుటుంబం ఇలాంటి భారీ ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమన్నారు. జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సర్వస్వం అగ్నికి ఆహుతి కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు వెంటనే స్పందించి సంభవించిన ఆస్తి నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ఆర్థిక సహాయం విడుదల చేసి, బాధితులకు గృహ నిర్మాణంతో పాటు జీవనోపాధి కల్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి తాము అన్నివిధాలా అండగా నిలుస్తామని, స్వచ్చంద సంస్థలు, దాతలు స్పందించి సాయహం అందించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, గౌస్ పాషా, బట్టు హరి, హుస్సేన్, రామకృష్ణ, బాబు, రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ