తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి.సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యం.పాలకుల నిర్లక్ష్యంపై మహిళలు గళమెత్తాలి.సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం. మహిళల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి మహిళా లోకం ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా సమాఖ్య నిర్మాణ బాధ్యలు ముత్యాల విశ్వనాథం పిలుపునిచ్చారు. తెలంగాణ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం మంగళవారం పాల్వంచ పట్టణంలోని సిపిఐ కార్యాలయం 'సిఆర్ భవన్'లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో నేటికీ మహిళలపై వివక్ష, వేధింపులు కొనసాగడం దురదృష్టకరమని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నప్పుడే నిజమైన రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి పాలకుల వైఖరిని నిరసిస్తూ నిరంతరం గళమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. మహిళా లోకానికి సంక్షేమం, రక్షణ కల్పించేవరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు. మహిళల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా నాయకులు వీసంశెట్టి పద్మజ, k. రత్నకుమారి, పైడిపల్లి లక్ష్మీ, షాహిన్, మీదిని లక్ష్మి, కైసర్, మామిడాల ధనలక్ష్మి, మారేమ్మ, గార్ల లక్ష్మీ, ప్రభావతి, హేమలత, ఈశ్వరమ్మ, వగెల పద్మ, వజ్జ లక్ష్మీ, భూక్యా జాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ