తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్కారు దవాఖానకు కార్పొరేట్ వైద్యం. ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి. కొత్తగూడెంలో త్వరలో క్యాథ్ ల్యాబ్. జీజీహెచ్‌కు రూ. 3 కోట్ల నిధుల మంజూరు. నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన విశేష కృషి ఎట్టకేలకు ఫలించింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ఆయన ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక సౌకర్యాలు సమకూరనున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే రోగుల ప్రాణాలను కాపాడేందుకు కీలకమైన అధునాతన క్యాథ్ ల్యాబ్ సేవలను ఇక్కడ త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పేదలు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా ఆస్పత్రిలోనే అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగుల కోసం అన్ని హంగులతో కూడిన 20 పడకల ఐసీయూ (ICU) విభాగాన్ని కూడా నిర్మిస్తున్నారు. గతంలో గుండెపోటు లేదా ఇతర తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మెరుగైన వైద్యం కోసం రోగులు సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, ఖమ్మం వంటి నగరాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యలోనే ఎందరో నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు జీజీహెచ్‌లోనే కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈ అన్ని రకాల అత్యున్నత వైద్య వసతులు సమకూరనుండటంతో స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటూ, సర్కారు దవాఖానను సూపర్ స్పెషాలిటీ స్థాయిలో తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కూనంనేని చొరవపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద రోగులకు ప్రాణవాయువులాంటి ఈ సౌకర్యాలను సాధించి చూపిన కూనంనేని సాంబశివరావు నాయకత్వంపై ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ ఆధునిక ఐసీయూ సేవల ద్వారా అత్యవసర విభాగంలో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ పరిధిలోనే అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య వసతులు కల్పించే దిశగా ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ