తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీపై ప్రత్యేక దృష్టి .నోటీసులు జారీ చేసే సమయంలోనే అవసరమైన పత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి .వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సూచించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన అనంతరం అవసరమైన ఓటర్లను విచారణకు పిలిపించి, సంబంధిత పత్రాలు, ఆధారాలను పరిశీలించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.నోటీసులు జారీ చేసే సమయంలోనే విచారణకు హాజరయ్యే ఓటర్లు సమర్పించాల్సిన అవసరమైన పత్రాలు, ఆధారాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు ఎలాంటి సందేహాలు లేకుండా ప్రక్రియను వివరించాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదేశం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు.నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు అందజేసిన వివరాలను బీఎల్‌ఓ యాప్‌లో ఫొటోతో సహా నమోదు చేయాలని, విచారణకు సంబంధించిన వివరాలతో పాటు ఓటర్లు సమర్పించిన పత్రాలు, ఆధారాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బూత్ స్థాయి అధికారులకు అవసరమైన అవగాహన కల్పిస్తూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశను కచ్చితంగా అమలు చేయాలని, ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగం సూపర్డెంట్ రంగ ప్రసాద్ , సంబంధిత శాఖల అధికారులు,ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ