తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మనమంతా నడవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులలో అగ్రగణ్యుడైన గాంధీజీ సత్యాగ్రహం, అహింసాయుత పోరాటం ద్వారా భారత స్వాతంత్ర్యానికి మార్గం సుగమం చేశారని తెలిపారు. ఆయన చూపిన ఆలోచనలే కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా మార్గదర్శకత్వం చేశాయని గుర్తు చేశారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరిస్తే సమాజం సత్సమాజంగా మారుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.అలాగే గాంధీ బోధనలు నేటి యువతకు ఎంతో ప్రేరణాత్మకమని, క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తన వృత్తి, వ్యక్తిగత జీవితం, సామాజిక బాధ్యతలలో గాంధీజీ ఆచరణను అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, ఏటీవో వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ