తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 16వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో 3,36,136 మంది పిల్లలు, యువతకు ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ • జూలై 20న మాప్-అప్ డే నిర్వహణ విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమని, నులిపురుగుల నివారణ ద్వారా వారి ఆరోగ్యం, పోషకాహార స్థితి, చదువుపై ఏకాగ్రత మరింత మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day–NDD) 16వ విడత కార్యక్రమాన్ని సోమవారం పాల్వంచ మండలం ఉలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బొల్లొరిగూడెం మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ ఘనంగా ప్రారంభించి విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన పిల్లలే చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తారని అన్నారు. నులిపురుగుల కారణంగా పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు శారీరక ఎదుగుదల, మానసిక వికాసం, చదువుపై ఏకాగ్రత కూడా దెబ్బతింటుందని వివరించారు. ఆల్బెండాజోల్ మాత్రలు నులిపురుగుల నివారణకు అత్యంత ప్రభావవంతమైనవని, అవి పూర్తిగా సురక్షితమైనవని తెలిపారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఎదుగుతారని చెప్పారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి అర్హత కలిగిన చిన్నారికి తప్పనిసరిగా మాత్రలు వేయించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 3,36,136 మంది పిల్లలు, యువతకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో 93,752 మంది అంగన్‌వాడీ చిన్నారులు, 1,06,310 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 28,273 మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, 85,653 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, 15,872 మంది ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు, 6,276 మంది పాఠశాలలకు వెళ్లని పిల్లలు ఉన్నట్లు వివరించారు. మొత్తం లబ్ధిదారుల్లో 1,76,029 మంది బాలురు, 1,60,107 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, వసతి గృహం, కళాశాలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మాత్రలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు ఇవ్వాలని, 1–2 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి, 2–19 సంవత్సరాల వయస్సు గల వారికి పూర్తి మాత్రను నమిలి మింగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ రోజు మాత్రలు తీసుకోలేని అర్హులైన పిల్లలకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి అర్హత గల చిన్నారికి నులిపురుగుల నివారణ మాత్రలు అందించి 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల ఆరోగ్యం & రోగనిరోధక టీకాల అధికారి (డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ) డా. ప్రతాప్, వైద్యాధికారి డా. దేవేందర్, జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగభూషణం, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ