తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో ఏర్పాటు చేసిన నాయకపోడు మాస్క్‌ల తయారీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ జితిష్ వి. పాటిల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్‌లో తయారవుతున్న నాయకపోడు మాస్క్‌ల తయారీ ప్రక్రియను పరిశీలించి, కళాకారులతో పరస్పరంగా మాట్లాడి వారి అనుభవాలు, సమస్యలు, అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదారం గ్రామంలో తయారవుతున్న నాయకపోడు మాస్క్‌లు నాయకపోడు సంస్కృతి, సంప్రదాయ కళలకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చాయని తెలిపారు. ఈ సంప్రదాయ హస్తకళను పరిరక్షిస్తూ మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాటు, మండలంలో ఉన్న నాయకపోడు నిరుద్యోగ యువతీ–యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో “గురు–శిష్య హస్తశిల్ప శిక్షణ కార్యక్రమం”ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ఈ శిక్షణ కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభమవుతుందని, తొలి దశలో 30 మంది నాయకపోడు నిరుద్యోగ యువతీ–యువకులతో రెండు నెలలపాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణకు హాజరయ్యే ప్రతి శిక్షణార్థికి రోజుకు రూ.300/- చొప్పున స్కాలర్‌షిప్ అందజేయబడుతుందని తెలిపారు. శిక్షణ కాలంలో సంప్రదాయ నాయకపోడు మాస్క్ తయారీతో పాటు నాణ్యత మెరుగుదల, ఆధునిక డిజైన్‌లు, మార్కెటింగ్ అంశాలపై కూడా ప్రాయోగిక అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం శిక్షణార్థులు స్వయం ఉపాధి, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంప్రదాయ హస్తకళలకు మార్కెట్ అవకాశాలు పెంచడంతో పాటు స్థానిక యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి డీఆర్‌డీఏ నుంచి ఏపీఎం ఆర్. ఉపేందర్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్ అంజన్ కుమార్ శిక్షణను అందిస్తారని, గురు–శిష్య విధానంలో ప్రాయోగికంగా నైపుణ్యాలు నేర్పిస్తారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్ అంజన్ కుమార్, డీఆర్‌డీఏ ఏపీఎం రామ్ కుమార్, సీసీ ఉపేందర్, మాస్క్ తయారీ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ