తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీకి చేపట్టిన ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, తమకు పరిచయాలు ఉన్నాయని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు.అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియకు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశించిన అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.ఎవరికి ఉద్యోగం వస్తుందో ముందుగా ఎవరికీ తెలియదని, ఎంపిక పూర్తిగా నిబంధనల ప్రకారం జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, దళారులను ఆశ్రయించకుండా అధికారిక ప్రక్రియపై మాత్రమే ఆధారపడాలని సూచించారు. వచ్చే వారంలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా తెలియజేస్తామని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ