తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణపతి ఉత్సవాల భద్రతకు పకడ్బందీ కార్యాచరణ.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు.నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచి, నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో విధుల్లో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ప్రాధాన్యతనిస్తూ నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో జాప్యం చేయరాదని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి నిబంధనలు, భద్రతా సూచనలను వివరించాలని తెలిపారు. శోభాయాత్రల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం రోడ్లపై అందుబాటులో ఉంటూ ప్రజలకు భద్రతా భరోసా కల్పించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల ఏర్పాట్లు వాటి పనితీరును సమీక్షించాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సైబర్ నేరాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని, సైబర్ మోసాల్లో నగదు కోల్పోయిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడే వారిపై నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ