తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించుటకు సిఆర్ఎం (Common Review Mission) బృందం ఈ రోజు జిల్లాను సందర్శించింది. ఈ సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన సిఆర్ఎం బృంద సభ్యులు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్న సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలు జరుగుతున్న ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, మాతా–శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ చర్యలు, వైద్య సేవల విస్తరణ, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. సిఆర్ఎం బృందం నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ వైద్య సంస్థలను సందర్శించి, ఆరోగ్య సేవల అమలు స్థాయిని, సిబ్బంది పనితీరును, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించనుంది. ఈ సందర్భంగా బృందం వైద్య సదుపాయాల అందుబాటు, మౌలిక వసతుల వినియోగం, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతను కూడా విశ్లేషించనుంది. ఈ బృందంలో డా. గురిందర్ బీర్ సింగ్ – అడ్వైజర్, CPC PHC, NHSRC, డా. బి. వెంకట శివారెడ్డి – అసిస్టెంట్ ప్రొఫెసర్, AIIMS మంగళగిరి, డా. అజయ్ పాండే – అసిస్టెంట్ ప్రొఫెసర్, PRC లక్నో, డా. అంకిత కంకర్య – అసిస్టెంట్ ప్రొఫెసర్, PGIMER చండీగఢ్, డా. అనర్ సింగ్ డాకర్ – సీనియర్ కన్సల్టెంట్, NHM పాలసీ, MoHFW మరియు డా. కల్పనా భవానియ – సీనియర్ కన్సల్టెంట్, PHA, NHSRC సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. జయలక్ష్మి, వివిధ ఆరోగ్య ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లా ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ