తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : తీజ్ పండుగ ఐక్యతకు, భక్తికి ప్రతీక గిరిజనుల ఆచారాలు కాపాడుకోవాలి ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి ఇది : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వాటిని భవిష్యత్ తరాలకు అందించేలా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లంబాడా గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయ తీజ్ పండుగ వేడుకలు మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప జీవన విధానం లంబాడీల సొంతమని పేర్కొన్నారు. ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో గోధుమ మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకుని చేసే నృత్యాలు గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా తమ మూలాలను, ఆచార వ్యవహారాలను మర్చిపోకుండా ఐక్యతతో ఇలాంటి పండుగలను జరుపుకోవడం అభినందనీయమని చెప్పారు. గిరిజన సంస్కృతిని కాపాడుతూ, వారి హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాభిర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఆర్గనైజర్ వీరు, భూక్య శ్రీనివాస్, జర్పుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ