తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బడుగు, బలహీన వర్గాల గొంతుక సురవరం. పార్లమెంటులో ప్రజా గళాన్ని బలంగా వినిపించిన ప్రజా నేత.సురవరం జీవితం కమ్యూనిస్టు కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం.నిరాడంబర జీవనం నేటి తరానికి ఆదర్శం.వామపక్ష ఐక్యతకు నిరంతరం పరితపించిన నేత.ఆయన చూపిన బాటలో ఉద్యమాలను నిర్మిద్దాం. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కే ఫహీం. కమ్యూనిస్టు ఉద్యమాల్లో చెరగని ముద్ర వేసిన సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కే ఫహీం పిలుపునిచ్చారు. సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం శనివారం స్థానిక జిల్లా సీపీఐ కార్యాలయమైన శేషగిరి భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎస్ కే ఫహీం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రజా పోరాటాల్లో పాల్గొని అంచెలంచెలుగా జాతీయ నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి సురవరం అని కొనియాడారు. కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం నిస్వార్థంగా పోరాడారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజా సమస్యలను చట్టసభల్లో సమర్థవంతంగా వినిపించి తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల ఐక్యత కోసం సురవరం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఆయన ఆచరించిన నిరాడంబరత, సిద్ధాంత నిబద్ధత నేటి యువతరానికి ఎంతగానో ఆదర్శనీయమని చెప్పారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసి ఆయనకు నిజమైన నివాళి అర్పించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గెడ్డాడు నగేష్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, నాయకులు ఎండి యూసుఫ్, గోపి కృష్ణ, ధర్మరాజు, మిర్యాల రాము షహీన్, కైసర్, మేదిని లక్ష్మి, చోటు షరీఫ్, ఆఫ్జల్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ