తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 8 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అటవీ ప్రాంతంలోని ఎలకలొడ్డు సమీపంలో... పోలారం చెరువులో ఉన్న వాగులకు వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. వాగు అవతలి వైపుకు మేతకు వెళ్లిన 300 (జీవాలు) మేకలు, గొర్రెలు, పశువులు వీటితోపాటు తొమ్మిదిమంది కాపరులు, పోడు రైతులు అవతలి వైపు అడవిలో చిక్కుకుపోయారు. వాగుకు ఒక్కసారిగా భారీగా వరదరావడంతో వాగు దాటడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షంతో పాటు చీకటి పడటంతో భయాందోళన చెందారు. ఈ ఆకస్మిక సంఘటన శనివారం రాత్రి జరిగింది. మనుషులతో పాటు జీవాలు కష్టంలో ఉన్న సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి భారీ వర్షంలో ఆ ప్రాంతానికి హుటా హుటిన చేరుకున్నారు. పోలీస్ వాహనాల వెలుతురులో వాగు అవతలి వైపు నుంచి జీవాలను, మనుషులను ఇవతిలివైపుకు శ్రమించి సురక్షితంగా తీసుకొచ్చారు. భయాందోళనలో ఉన్న వ్యక్తులకు ధైర్యం చెప్పి, 300 జీవాలను వాగు ఇవతలి ఒడ్డుకు చేర్చిన ఎస్సై రాణా ప్రతాప్, హెడ్ కానిస్టేబుల్ దయానంద్ మరియు సిబ్బందికి వారు చేతులెత్తి నమస్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ