తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈసిఐఎల్ సంస్థ సిఎస్ఆర్ ద్వారా రూ.67.41 లక్షల విలువైన వైద్య పరికరాల అందజేత ఐసీయూ, నేత్ర, ఆర్థోపెడిక్ విభాగాలతో పాటు ఆసుపత్రి పరిశుభ్రతకు ఆధునిక పరికరాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కొత్తగూడెంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , హైదరాబాద్ సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా రూ.67.41 లక్షల విలువైన ఆధునిక వైద్య, ఆసుపత్రి పరిశుభ్రత పరికరాలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందజేసింది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సమక్షంలో ఈసిఐఎల్ అధికారులు ఈ పరికరాలను ఆసుపత్రి అధికారులకు అందజేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా అందజేసిన పరికరాల్లో ఐసీయూ సేవల కోసం 3-ఫంక్షన్ రిమోట్ ఆపరేటెడ్ ఫౌలర్ కాట్స్, నేత్ర వైద్య సేవల కోసం ఆప్తాల్మిక్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్, ఫుట్ అడ్జస్ట్మెంట్ సదుపాయంతో కూడిన ఆప్తాల్మిక్ ఎలక్ట్రిక్ ఆపరేషన్ టేబుల్, ఆర్థోపెడిక్ డ్రిల్ యూనిట్ విత్ యాక్సెసరీస్, వాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ (VAC) మెషిన్ ఉన్నాయి. అదేవిధంగా ఆసుపత్రి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు స్క్రబ్బింగ్ మెషిన్, కాంపాక్ట్ వాక్-బిహైండ్ స్వీపర్, హై-ప్రెజర్ వాషర్ వంటి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , సిఎస్ ఆర్ సంస్థల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులకు అందుతున్న వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలతో ఐసీయూ, నేత్ర, ఆర్థోపెడిక్ తదితర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రోగులకు సకాలంలో అవసరమైన వైద్యం అందేలా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యం కోసం వేచి ఉన్న ఓ రోగిని గమనించిన కలెక్టర్, ఎందుకు వేచి ఉన్నారు, సమస్య ఏమిటని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఓపీ సమయం ముగిసిన అనంతరం ఆసుపత్రికి వచ్చినందున వేచి ఉన్నట్లు రోగి తెలిపాడు. వెంటనే స్పందించిన కలెక్టర్, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్య సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సేవల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆసుపత్రి పరిశుభ్రతకు అందజేసిన పరికరాలను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, వైద్య విభాగాలు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోగులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఈసిఐల్ సంస్థ తరఫున డైరెక్టర్ (పర్సనల్) కన్నెన్ వి.ఏ.ఎస్., సీఎంఓ & ఇన్‌చార్జి (CSR) డా. పి. వేణుబాబు, డిప్యూటీ మేనేజర్ (HR), CSR సునీల్ కుమార్ జె., డిప్యూటీ మేనేజర్ (సివిల్) అనిల్ కుమార్ ఏ., ECOA అధ్యక్షులు పూర్ణచందర్ పి. ఫోటోగ్రఫీ అధికారి సాంబమూర్తి పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. రాధామోహన్, CPO శ సునీత, ఆసుపత్రి సీనియర్ అధికారులు, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ