తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి అవసరమైన గోటి తలంబ్రాల తయారీ కోసం గుండెపుడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో వరినాటు కార్యక్రమం నిర్వహించారు. లింగాలబోడు సమీపంలో మద్దెబోయిన నరసింహారావు–రాధ దంపతులు స్వామివారి సేవార్థం సమకూర్చిన 10 గుంటల వరి పొలంలో భక్తులు ఉపవాస దీక్షతో వరినాటు వేశారు. జూలూరుపాడు, వెంగన్నపాలెం, గుండెపుడి తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంలో వరినాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవానికి తమ వంతు సేవ అందించారు. శ్రీ సీతారాముల కల్యాణానికి ఉపయోగించే గోటి తలంబ్రాల కోసం వరి సాగు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ