తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ కాలనీ వాసులు సింగరేణి బొగ్గు లోడు టిప్పర్లని అడ్డుకొని ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రా పురం వెళ్లే మార్గంలో జిల్లా కోర్టు నుంచి మొదలు అనేక ప్రభుత్వ, సింగరేణి కార్యాలయాలతో పాటు చర్చీలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడి తీవ్రమైన కాలుష్యభరితంగా మారింది. సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గులోడు టిప్పర్లు నిత్యం ఈ మార్గంలో రవాణా జరుగుతుండడం వల్ల రోడ్లకు ఈ దుస్థితి ఏర్పడిందని, స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ఇటీవల శేషగిరి నగర్ కాలనీ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ గా ఎన్నికైన కృపా రేచల్ విమర్శించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ మార్గాన్ని ఫోర్ లైన్ రోడ్డుగా ఏర్పాటు చేస్తామని, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలంటూ సింగరేణి సంస్థ నుంచి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా 10 కోట్లు మంజూరు చేయాలని గతంలో ప్రతిపాదించి మాటలతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆమె ఆరోపించారు. నెలలు గడుస్తున్నా కూడా ఈ మార్గంలో గుంతలు మరింత ఎక్కువగా ఏర్పడి తీవ్రమైన దుమ్ము ధూళి కాలుష్యంతో శేషగిరి నగర్ కాలనీ వాసులు అనేక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని సర్పంచ్ కృపా రేచల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ