తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి కొత్తగూడెం కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కమిషనర్ సుజాతను కోరారు. శనివారం కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతినెల 4వ తేదీ లోపు పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు నాల్గవ తేదీ లోపు వేతనాలు చెల్లించామని గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ, సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. పదవ తేదీ వచ్చిన పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు నేటికీ గౌరవ వేతనం అందలేదని విమర్శించారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు పనులు మానేయడంతో కొత్తగూడెం కార్పొరేషన్ మురికి కూపంగా మారుతుందని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ