తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందజేసి తగు సూచనలు చేయాలన్నారు. ఈనెల 11న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతం నివేదికను టీ పోల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు ప్రీసైడింగ్ అధికారులకు రిటర్నింగ్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ లు, ఇతర సిబ్బంది సహకరించాలన్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఓటర్లకు సకాలంలో పోలింగ్ స్లిప్స్ అందజేయాలన్నారు. మరో రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కొన్ని గ్రీన్ పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరకుగూడం మండలాల పరిధిలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295 మంది సిబ్బంది నియమించారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఐడిఓసి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి, అవసరమైన అన్ని సామాగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియలపై స్పష్టమైన సూచనలు అందించినట్లు తెలిపారు. భద్రాచలం–సారపాక వంటి ప్రధాన పంచాయతీల్లో బ్యాలెట్ బాక్సుల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ నెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపును ప్రారంభించి సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, డిపిఓ సుధీర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ