తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రత, ఇతర శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ, నిర్దేశిత కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన వినతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే విశ్వసనీయ వేదిక అని అన్నారు . ప్రజల వినతులను కేవలం నమోదు చేయడం కాకుండా, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఏమాత్రం తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రజలు తమ వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులు సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామానికి చెందిన సంఘం నాగేశ్వరరావు, తన తండ్రి మరణించడంతో ఆయన పేరుపై ఉన్న పట్టా భూమిని వారసత్వ హక్కు ప్రకారం తన పేరుకు మార్చాలని చేసిన వినతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి, తదుపరి చర్యల కోసం సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం రాజు తండా గ్రామానికి చెందిన అజ్మీర రవి, కొత్తగూడెం–ఇల్లందు జాతీయ రహదారి విస్తరణలో తన ప్రహరీ గోడతో పాటు మూడు గదుల ఇల్లు కోల్పోతున్నందున తగిన నష్టపరిహారం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి, అవసరమైన చర్యల కోసం టేకులపల్లి తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం ఇందిరానగర్‌కు చెందిన పోతరాజు రమేష్, గత నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతూ, 50 శాతం వైకల్యం ఉన్నందున కుటుంబానికి ఆర్థిక ఆధారం లేక చికిత్స భారంగా మారిందని పేర్కొంటూ వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును జిల్లా కలెక్టర్ పరిశీలించి, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారికి ఎండార్స్ చేశారు. బూర్గంపహాడ్ మండలం ఎదుళ్ల చెరువు గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు, తాను 2000 సంవత్సరం నుంచి సాగు చేస్తున్న 1 ఎకరం 50 సెంట్ల పోడు భూమిలో సాటిలైట్ పాయింట్ మంజూరైందనే కారణంతో అధికారులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఆ భూమికి సంబంధించి సర్వే కూడా పూర్తయిందని పేర్కొంటూ వ్యవసాయం కొనసాగించేందుకు అనుమతి కల్పించాలని చేసిన వినతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి, తగు చర్యల కోసం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ