తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండాలి నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజారోగ్యం, తాగునీరు, విద్య, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు సన్నద్ధతతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల వైవిధ్యీకరణ, రైతు రిజిస్ట్రీ, తాగునీరు, నీటిపారుదల, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యానవనం, సూక్ష్మ సాగునీరు, ఆయిల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వానాకాలం–2026 సీజన్‌లో 138.49 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు 99.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇప్పటికే 510.93 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని, 68 మందిని అరెస్టు చేసి, 34 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జూలై నెలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నానో యూరియా వినియోగాన్ని రైతుల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని తెలిపారు. రైతు రిజిస్ట్రీ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని పేర్కొంటూ, అర్హులైన ప్రతి రైతు నమోదు పూర్తయ్యేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇస్తూ వరితో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఉద్యాన పంటల అభివృద్ధి, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టుల అమలులో జిల్లాల వారీగా పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో జ్వరాలపై ప్రత్యేక నిఘా చేపట్టి ప్రతిరోజూ నివేదికలు పంపాలని, ప్రతి శుక్రవారం "డ్రై డే" నిర్వహిస్తూ దోమల నివారణ, లార్వా నిర్మూలన, ఫాగింగ్, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా కేసులు తగ్గినప్పటికీ టైఫాయిడ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, పాఠశాలలు, వసతి గృహాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఆహార తయారీ నుంచి పంపిణీ వరకు పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఆధారంగా ఆహార అవసరాలను అంచనా వేసి వ్యర్థాలను నివారించాలని, డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పథకం అమలును జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వానాకాలంలో రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వానాకాలం వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు రైతు రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రభుత్వ పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, మిషన్ భగీరథ ఈఈ నళిని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ