తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకున్న ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 ద్విచక్ర వాహనాలు మోడిఫైడ్ సైలెన్సర్లతో నడుస్తున్నట్లు గుర్తించి, ఆయా వాహనదారులపై మోటారు వాహనాల చట్టం–1988 సెక్షన్ 190(2) ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించి వసూలు చేశారు. అనంతరం అన్ని వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం వల్ల తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, ఇటువంటి మార్పులు చట్టవిరుద్ధమని తెలిపారు. వాహనదారులు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ