తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" సైబర్ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా ప్రస్తుతం ఎక్కువ జరుగుతున్న డిజిటల్ అరెస్ట్, స్టాక్ మరియు బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, ఏపీకే ఫైళ్ల ద్వారా జరిగే సైబర్ నేరాలు, మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల వినియోగం వంటి సైబర్ మోసాల గురించి ఎస్పీ గారు ఉదాహరణలతో విద్యార్థినులకు వివరించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, సినిమా అవకాశాలు, తక్కువ వడ్డీ రుణాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని సూచించారు.అదేవిధంగా సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తూ, డిజిటల్ లావాదేవీల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఓటిపిలు, కేవైసీ అప్‌డేట్, లోన్‌లు లేదా రివార్డుల పేరుతో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని తెలిపారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. అలాగే విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్, సైబర్ సెల్ పోలీసు అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ