తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోదరభావానికి, రక్షణకు రాఖీ ప్రతీక.మహిళల హక్కుల పరిరక్షణకు కట్టుబడాలి.సమాజ వికాసంలో స్త్రీల పాత్ర కీలకం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించేందుకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం, శ్రీనగర్ కాలనీలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు ఆయనకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సాబీర్ పాషా మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో, కుటుంబ వికాసంలో మహిళలు పోషిస్తున్న పాత్ర అమోఘమైనదన్నారు. స్త్రీలకు సమాన అవకాశాలు, రక్షణ కల్పించినప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నేటికీ సమాజంలో మహిళలు అనేక రూపాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా సంఘాలు, మహిళా లోకం సమష్టిగా గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల హక్కుల పరిరక్షణకు, వారి ఆత్మగౌరవ పోరాటాలకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మహిళాసమాఖ్య సభ్యులు సౌజన్య, రత్నకుమారి, ధనలక్ష్మి, మేదిని లక్ష్మి, కైసర్, షాహీమ్, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ