తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంట రుణాలు, భరోసా రాక అంబసత్రం రైతుల అవస్థలు పోడు, అంబసత్రం సాగుదారుల పట్టాల కోసమే మా పోరాటం మండల రైతాంగానికి సీతారామ జలాలందించాలి లక్ష్మీదేవిపల్లి మండలంలో సిపిఐ జనచైతన్య యాత్రకు అపూర్వ స్పందన దశాబ్దాలుగా భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న అంబసత్రం భూముల పేద రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా పాలకులు గోసపెట్టడం తగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కౌన్సిల్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఐదో రోజైన సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలో సాగింది. సీతారాంపురం, లాలూ తండా, కోరుకొండ, హేమచంద్రాపురం తదితర గ్రామాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సెంటర్లలో జరిగిన బహిరంగ సభల్లో యాత్ర రథసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ మండల పరిధిలోని 264 సర్వే నంబర్లోని ఐదు వేల ఎకరాల అంబసత్రం భూములను గిరిజన, గిరిజనేతర పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్నప్పటికీ ఆ భూములపై చట్టబద్ధమైన హక్కులు లేవనే సాకుతో ప్రభుత్వం రైతు భరోసా నిలిపివేసిందని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు పెట్టుబడులు లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూ తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే సాగుదారులకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని, నిర్మితమవుతున్న సీతారామ ఎత్తిపోతల జలాలను లక్ష్మీదేవిపల్లి మండల రైతాంగానికి సాగునీరుగా పారించి భూములను సస్యశ్యామలం చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకంటక విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, కార్మిక చట్టాలను రద్దు చేసి శ్రమజీవుల పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రజల మధ్య మత విద్వేషాల చిచ్చుపెడుతున్న కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే బీజేపీ వైఖరి మారేవరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. టేకులపల్లిలో ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య యాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరి వెంకటేశ్వర్లు మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, కందుల భాస్కర్, జి వీరస్వామి, వాసిరెడ్డి మురళి, కే కే ఫహీం, ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు భూక్యా శ్రీనివాస్, వరక అజిత్, నిమ్మల రాంబాబు, కాటూరి రాము, జర్పుల ఉపేందర్, రత్నకుమారి, సర్పంచులు ఉపసర్పంచులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ