తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై అసంతృప్తి మెనూ అమలులో నిర్లక్ష్యంపై వార్డెన్‌కు షోకాజ్ నోటీసు వసతి గృహంలో సౌకర్యాలు, ఆహార పదార్థాల నాణ్యతపై పరిశీలన పనిచేయని ఆర్వో ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలి లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడ అపరిశుభ్రతతో పాటు చెత్త ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని ఎన్‌సీసీ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎన్‌సీసీలో ఉన్న విద్యార్థుల సంఖ్య, గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం తదితర వివరాలను ఉపాధ్యాయులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తదుపరి బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, భోజనం తదితర సౌకర్యాలను పరిశీలించారు. కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి నిల్వ ఉంచిన సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కిచెన్‌లోని ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడాన్ని గమనించిన కలెక్టర్, అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టి ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, తాగునీరు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మెనూలో చికెన్ అందించాల్సి ఉన్నప్పటికీ విద్యార్థులకు వడ్డించిన భోజనంలో చికెన్ లేకపోవడాన్ని కలెక్టర్ గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించడంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేస్తూ, సంబంధిత వార్డెన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం విషయంలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు . ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో సుచిత్ర, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ