తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్.ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన జిల్లాలలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహణ, పర్యాటక రంగ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. యువతలో పర్యాటక రంగంపై ఆసక్తిని పెంపొందించేలా చర్యలు చేపట్టడంతో పాటు, జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాల ప్రచారం, అభివృద్ధిపై ఆసక్తి ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. యువ టూరిజం క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమాలను ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో నిర్వహించాలని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 142 పర్యాటక ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సందర్శకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, ఫిల్మ్ టూరిజం ద్వారా కూడా పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాల్లోని చారిత్రక, సాంస్కృతిక, సహజ పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా ఆయా జిల్లాలను ప్రముఖ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.జ్ఞాన భారత్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న పురాతన మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి డిజిటలైజేషన్ చేయనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, జిల్లాలోని వివిధ ప్రాంతాలు, దేవాలయాలు, మఠాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద అందుబాటులో ఉన్న పురాతన మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి సమగ్ర జాబితాను రూపొందించాలని సూచించారు. గుర్తించిన మాన్యుస్క్రిప్ట్‌లను డిజిటలైజ్ చేసి కేంద్రీకృత సేకరణలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, సహజ పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించి, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా టూరిజం నోడల్ అధికారి అనూష, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ