తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు మరియు వివిధ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి లోపాలు గమనించిన చోట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మొదటగా ఇల్లందు వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రి ఎదుట ప్రైవేట్ అంబులెన్స్ నిలిపి ఉంచడం గమనించి దాని అవసరం, అనుమతులపై అధికారులను ప్రశ్నించారు. ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తగిన వివరణ ఇవ్వాలని ఆర్‌ఎంఓను ఆదేశించారు.ఇన్‌పేషెంట్ విభాగాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేసి కేసుల సంఖ్య, సేవల నాణ్యతపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో డయాలసిస్ కేసులు అధికంగా నమోదవుతున్న కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించి విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ఆసుపత్రికి అవసరమైన అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా ఒక బాధితుడు అందజేసిన వినతి పత్రంపై స్పందించిన కలెక్టర్, అత్యవసర సమయంలో ప్రవేట్ అంబులెన్స్ మాట్లాడుకున్నప్పటికీ అధిక డబ్బు ఆశతో నిర్లక్ష్యం వహించడం వల్ల రోగి మరణించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం జరిగిందని భావిస్తూ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. అత్యవసర సేవల్లో ఎటువంటి లోపాలు సహించబోమని స్పష్టం చేశారు.అనంతరం ఇల్లందు ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, వంటశాలలో సిద్ధం చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం విభిన్న వంటకాలు అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థుల పోషణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి సరుకుల నాణ్యత, నిల్వ విధానాలపై అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని భవనం మరమ్మతులు, ఫ్యాన్లు, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలు, భోజన నాణ్యత, బోధనపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం సమయానికి సంబంధించి సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం, మెనూ పాటించకపోవడం మరియు పరిశుభ్రత లోపాలు గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించబోమని స్పష్టం చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్ భరత్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇల్లందు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్‌కు విద్యార్థులు వార్డెన్ సిబ్బంది ఎవరు లేకపోవడం గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో సంబంధిత వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, నిర్ణీత సమయానికి భోజనం సిద్ధం కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది విధుల్లో లోపాలు గమనించి వార్డెన్‌ను హెచ్చరించారు. విద్యార్థులకు సమయానికి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడం తప్పనిసరి బాధ్యత అని స్పష్టం చేశారు.వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశిస్తూ, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత విషయాల్లో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్య, వైద్యం మరియు సంక్షేమ రంగాల్లో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఆర్‌ఎంఓ రామ్ నివాస్, డ్యూటీ డాక్టర్ ప్రత్యూష, వస్తి గృహాలు వార్డెన్లు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ