తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆనందగిరి గుట్టలపై వైభవంగా అయ్యప్ప స్వామి ప్రతిష్ఠా మహోత్సవం – పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం అన్నపురెడ్డి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ ఆగమ శాస్త్రానుసారంగా ఈ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ మహోత్సవానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఆయనతో పాటు అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కలశాభిషేకం, విశేష పూజలు, అర్చన కార్యక్రమాలలో మంత్రి పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.మహోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠతో యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమై, పుణ్యాహవాచనం, వాస్తు శాంతి, మహాసంకల్పం, విశేష హోమాలు నిర్వహించబడ్డాయి. అనంతరం కలశ స్థాపన చేసి, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పవిత్ర తీర్థ జలాలతో కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ గోపురం, విమానం, ధ్వజస్తంభం, గర్భగుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం జరిపారు. స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన తిరుమంజనం, అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించగా, పుష్పాలంకరణతో ఆలయం శోభాయమానంగా అలంకరించబడింది. అనంతరం మహా మంగళహారతి, తీర్థప్రసాదాల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించబడగా, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం పొందారు.అనంతరం మంత్రి చండ్రుగొండ మండలం మద్దుకూరు గుంపెనలోని ఆనందగిరి గుట్టలపై భక్తుల సహకారంతో నిర్మితమైన శ్రీ శ్రీ శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మహోత్సవం 01-05-2026 నుండి 06-05-2026 వరకు వేద మంత్రోచ్చారణల నడుమ ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించబడింది. ఇందులో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, మహాసంకల్పం, యజ్ఞాలు, విశేష హోమాలు, కలశ స్థాపన, ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా,జిల్లా కలెక్టర్ అంకిత్ తో కలసి మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. కార్యక్రమం మొత్తం భక్తి భావంతో సాగగా, ఆలయ పరిసరాలు "స్వామియే శరణం అయ్యప్ప" నినాదాలతో మార్మోగాయి.మహోత్సవాలు ప్రశాంతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, రవాణా, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా కల్పించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ ట్రస్టు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ