తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనగణన-2027 ప్రక్రియలో రూపొందించే జాబితా ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సూపర్వైజర్లతో గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జనగణన నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు కీలకమైన ప్రక్రియ అని అన్నారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ సమయంలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. జనగణన జాబితాలో నమోదు చేసే సమాచారం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, ఖచ్చితంగా ఉండేలా ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి సర్వే పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎలాంటి లోపాలు లేదా పొరపాట్లు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి సేకరించే వివరాలను పారదర్శకంగా నమోదు చేసి, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ప్రత్యేకంగా కేటీపీఎస్, సింగరేణి ప్రాంతాల్లో జనగణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని, అక్కడి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో వివరాల సేకరణ చేపట్టాలని సూచించారు. జనగణన కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేలా అధికారులు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సూపర్వైజర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ