తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీట్-పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.పరీక్ష కేంద్రంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి. అభ్యర్థుల గుర్తింపు, సీసీటీవీ, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి.జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో ఈ నెల 30న నిర్వహించనున్న నీట్-పీజీ–2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు, సాంకేతిక అంతరాయాలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.నీట్-పీజీ–2026 పరీక్ష ఈ నెల 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సుజాతనగర్‌లోని అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్‌లో నిర్వహించనున్నారు. జిల్లాలో ఇదే ఏకైక పరీక్షా కేంద్రం కాగా, మొత్తం 100 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థుల ఫ్రిస్కింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా, మాల్‌ప్రాక్టీస్ నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆభరణాలు, వాటర్ బాటిల్లు, ఎటువంటి వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరాదని, నిశితంగా పరిశీలించిన తర్వాతను మాత్రమే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు.పరీక్షా సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. పరీక్ష సమయాల్లో విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో ఇంటర్నెట్, సీసీటీవీ కెమెరాలు తదితర సాంకేతిక సదుపాయాలు సక్రమంగా పనిచేసేలా ముందస్తుగా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.సుజాతనగర్ తహసీల్దార్ పరీక్షా కేంద్రాన్ని ముందుగానే సందర్శించి ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను పరిశీలించి, లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్ 163 అమలు చేయడంతో పాటు, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను ఆ సమయంలో మూసివేయించాలి. పరీక్ష సమయంలో తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.అభ్యర్థులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కిట్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ తదితరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.పరీక్షా కేంద్రంలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్, అవకతవకలకు అవకాశం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సుజాతనగర్ తహసీల్దార్ వి. కృష్ణ ప్రసాద్‌ను డ్యూటీ మేజిస్ట్రేట్‌గా నియమించారు. కొత్తగూడెం ఆర్డీఓ పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షిస్తూ పరీక్ష సమయంలో తనిఖీలు నిర్వహించనున్నారు.పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ బి. శ్రీకాంత్, అబ్జర్వర్‌గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి హెచ్. వెంకటేశ్వరరావు విధులు నిర్వహించనున్నారు.పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రతి అధికారి తనకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లయితే నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు.నీట్-పీజీ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, విద్యుత్, వైద్య, విద్య, ఎన్‌ఐసీ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి ఆర్ వో పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సుజాతనగర్ తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, అబ్దుల్ కలాం కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, పోలీస్ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ