తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జైత్రామ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.వారసత్వ ఉద్యోగం, పరిహారం త్వరలోనే అందిస్తాం.కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. విధి నిర్వహణలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు భూక్య జైత్రామ్ కుటుంబానికి కార్పొరేషన్ అన్ని విధాలా అండగా ఉంటుందని కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని 23వ డివిజన్, మంగపేట గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్పొరేషన్ మల్టీపర్పస్ కార్మికుడు భూక్య జైత్రామ్ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల గ్రామంలో విద్యుత్ దీపాలు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి తీవ్రంగా గాయపడిన జైత్రామ్, ఖమ్మం మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతో కలిసి జైత్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జైత్రామ్ ఆకస్మిక మృతి కార్పొరేషన్‌కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, నిబంధనల ప్రకారం వారసత్వ ఉద్యోగం, ఆర్థిక పరిహారం, రావాల్సిన ఇతర ప్రయోజనాలు త్వరితగతిన అందేలా ఇప్పటికే అధికారిక చర్యలు ప్రారంభించామని తెలిపారు. నివాళులర్పించిన వారిలో మండల నాయకులు భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, దారా శ్రీనివాస్ తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ