తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల కార్మికుల నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించి, విద్యను అందించే బాధ్యతను సంబంధిత శాఖలు సమన్వయంతో నిర్వర్తించాలని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో పాటు, అవసరమైతే సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందించాలని ఆదేశించారు. బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆపరేషన్ స్మైల్ టోల్ ఫ్రీ నెంబర్లపై అవగాహన కల్పించాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో, ఆశ్రమాలలో ఉన్న పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా వారికి నాణ్యమైన విద్యతో పాటు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం కల్పించవచ్చని తెలిపారు. ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, రెస్క్యూ కార్యకలాపాలకు అవసరమైన వాహనాలు తదితర సౌకర్యాలపై నివేదికలు అందించాలని తెలిపారు. అందిన నివేదికల ఆధారంగా అవసరమైన వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటివరకు 25 మంది పిల్లలను ఆపరేషన్ స్మైల్ ద్వారా రెస్క్యూ చేయడం జరిగింది అని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, సిపిఓ సంజీవరావు,జిల్లా కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్, సి డబ్ల్యూ సి మెంబర్లు, సాదిక్ పాషా, సుమిత్ర దేవి, అంబేద్కర్, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ