తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, జీసిసి ద్వారా అటవీ ఉత్పత్తులు మరియు గిరిజన, ఎస్ హెచ్ జి మహిళలకు చేయూత అందించడానికి నెలకొల్పిన భద్రగిరి మార్ట్ విశేష ఆదరణ పొందుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు సాయంత్రం సుజాతనగర్ మండలంలోని ఎల్లయ్య అనే రైతు ఎద్దుగానుగాతో తయారుచేసిన కల్తీ లేని మంచి నూనె తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని మహిళా సంఘాలు తయారుచేసిన ఆర్గానిక్ వస్తువులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుదలతో వివిధ రాష్ట్రాల నుండి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకర్షించేలా భద్రగిరి మార్ట్ నెలకొల్పడం జరిగిందని అన్నారు. భద్రగిరి మార్ట్ లో పూర్తిస్థాయిలో లభించే ప్రతి నిత్యవసర సరుకులు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, అడవి నుంచి సేకరించిన అటవీ ఉత్పత్తులు గిరిజన మహిళలు సొంతంగా తయారు చేస్తున్న మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు అలాగే వివిధ రకాల పచ్చళ్ళు, నెయ్యి, తేనెతోపాటు ఎద్దుగానుగతో తయారుచేసిన కల్తీ లేని నూనె ఇతర నిత్యావసర సరుకులకు మంచి డిమాండ్ ఉండడంతో భద్రగిరి మార్ట్ కు ప్రజల ఆదరణ పెరుగుతుందని అన్నారు. భద్రగిరి మార్ట్ కు సరఫరా చేసే ఇతర నిత్యవసర సరుకులను మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ ద్వారా నియమించబడ్డ ప్రత్యేక బృందాలు వారి గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించి నాణ్యమైన సరుకులనే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సరఫరా చేసే నిత్యవసర సరుకులు ఏమాత్రం కల్తీ జరిగినట్లు పరీక్షలో తేలితే వెంటనే వారిని తొలగించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఎల్లయ్య సరఫరా చేస్తున్న ఎద్దు గానుగ నూనెకు మంచి డిమాండ్ ఉందని ఈ విధంగానే ఎటువంటి కల్తీ లేకుండా సరఫరా చేయాలని రైతుకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ మరియు రైతు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం భద్రాచలం నుండి జారీ చేయడం అయినది
Admin
తెలుగు వెలుగు టీవీ