తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రీ సర్వేను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ అంకిత్. సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి.ఎస్‌ఐఆర్‌లో నోటీసుల జారీ, హియరింగ్స్, పత్రాల అప్‌లోడ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి తహసీల్దార్లు, సర్వే, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా రీ సర్వే పురోగతిని సమీక్షించారు. రీ సర్వేలో గ్రామసభను మొదటి దశగా నిర్వహించి రైతులకు సర్వే విధానం, తేదీలు, భూ హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామసభలు పూర్తయిన వెంటనే గ్రామ సరిహద్దుల నిర్ణయం, హద్దుల గుర్తింపు, క్షేత్రస్థాయి సర్వే వంటి తదుపరి ప్రక్రియలను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని ఆదేశించారు.మండలాల వారీగా సమీక్షలో కొన్ని గ్రామాల్లో గ్రామ సరిహద్దుల నిర్ణయం, హద్దుల స్థిరీకరణ, సర్వే పనులు కొనసాగుతున్నట్లు, మరికొన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తయి తదుపరి ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి సర్వే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు, జీపీఓలు, వీఆర్‌ఓలను సమర్థవంతంగా వినియోగించి రోజువారీ లక్ష్యాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాత భూ రికార్డులు, మ్యాపులను పరిశీలించి, భూ హద్దులు, సర్వే పాయింట్లు, కోఆర్డినేట్ల నమోదులో పూర్తి ఖచ్చితత్వం పాటించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించాలని తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం రైతులకు ఖచ్చితమైన హద్దులు, కోఆర్డినేట్లతో కూడిన భూ మ్యాప్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండలాల వారీగా భూముల వివరాలు, భూ హద్దుల నిర్ధారణ, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను సమీక్షించారు. భూ యజమానులతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించి నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడైనా సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించాలని, అవసరమైన శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జారీ, హియరింగ్స్ , సంబంధిత పత్రాల ఆన్‌లైన్ అప్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండలాల వారీగా హియరింగ్స్ పురోగతిని పరిశీలించి, కొన్ని మండలాల్లో హియరింగ్స్ సంఖ్య సిస్టమ్‌లో నమోదు కాకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రుగొండ మండలంలో 24 నోటీసులకు సంబంధించి హియరింగ్స్ నిర్వహించినప్పటికీ, సంబంధిత పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడంతో సిస్టమ్‌లో పురోగతి నమోదు కాలేదని అధికారులు వివరించారు. హియరింగ్ నిర్వహించడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జిల్లాలో రాష్ట్రస్థాయి పురోగతి 62 శాతంగా ఉండగా, భద్రాచలం 57.51 శాతం, పినపాక 51 శాతం పురోగతి నమోదైనట్లు సమీక్షలో వెల్లడైంది. గుండాల, పాల్వంచ, పినపాక, అశ్వాపురం, అల్లపల్లి, చంద్రుగొండ, దమ్మపేట, కరకగూడెం తదితర మండలాల్లో నోటీసుల జారీ, హియరింగ్స్ పురోగతిని పరిశీలించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన కేసుల్లో హియరింగ్స్ నిర్వహించి, సంబంధిత పత్రాలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో నోటీసుల జారీ, హియరింగ్స్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని, నోటీసు జారీ నుంచి హియరింగ్, పత్రాల అప్‌లోడ్ వరకు ప్రతి దశను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు .
Admin
తెలుగు వెలుగు టీవీ