తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూసేకరణను వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి ఈ నెలాఖరులోగా ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేలా చర్యలు వచ్చే ఏడాది జూన్ నాటికి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు మారెళ్లపాడు ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇక ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణను వేగవంతం చేసి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన భూసేకరణ, పైప్‌లైన్ పనులు, ఇతర నిర్మాణ పనుల పురోగతిని ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పంపును ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, భూసేకరణతో పాటు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు వివరించారు. భూసేకరణను వేగవంతం చేసేందుకు రైతులు సహకరించాలని కోరారు. ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రైతులే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని రైతులతో మంత్రి అన్నారు. వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు కొంతమంది రైతుల కారణంగా నిలిచిపోవడం సమంజసం కాదని మంత్రి అన్నారు. కొంతమంది కోసం ఎక్కువ మంది రైతులకు కలిగే ప్రయోజనాలను వదులుకోలేమని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణను పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సాగునీటిని అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ