తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గేట్ మీటింగ్‌లో అంతరాయం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ.పారిశ్రామిక సంబంధాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించం.ఖబడ్దార్... కార్మికులకు ప్రయోజనాలు కలిగించే అగ్రిమెంట్లు పై విషప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం.కొత్తగూడెం ఏరియాలోని పీ.వీ.కే.-5 గని వద్ద సెప్టెంబర్ 4న గుర్తింపు సంఘం హోదాలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఉద్దేశపూర్వకంగా అంతరాయం సృష్టించి, నాయకులతో వాగ్వాదానికి దిగి ఘర్షణ వాతావరణం నెలకొల్పేలా వ్యవహరించిన ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు లగ్గాల అజయ్, పేరం వినోద్‌లపై సంస్థ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య ఆదివారం ఒక ప్రకటనలో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి సమక్షంలో యాజమాన్యంతో చర్చలు జరిపి సాధించిన 21 అంశాల ఒప్పందాలు, వాటివల్ల కార్మికులకు కలిగే ప్రయోజనాలను ఏఐటీయూసీ నాయకులు కార్మికులకు వివరిస్తున్న సమయంలో ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తూ, నాయకులతో వాగ్వాదానికి దిగారని వారు ఆరోపించారు.గేట్ మీటింగ్‌ను అంతరాయం కలిగించే ఉద్దేశంతో పకడ్బంది వ్యూహంతో వచ్చారని అన్నారు, అయితే సమావేశంలో ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేలా వ్యవహరించడం ద్వారా పారిశ్రామిక సంబంధాలకు విఘాతం కలిగించే పరిస్థితిని సృష్టించారని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు.జనరల్ అసిస్టెంట్ల సమస్యను ముందుపెట్టి జరిగిన అసలు ఘటనను పక్కదారి పట్టిస్తూ, కార్మికులు ఒప్పందాలను వ్యతిరేకించినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. కార్మిక సమస్యలపై భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించుకోవాలని, సమావేశాల్లో అంతరాయం సృష్టించడం సరైన విధానం కాదని తెలిపారు.సెప్టెంబర్ 4న జరిగిన ఘటనపై అదే రోజు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై వారు ప్రశ్నించారు.ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదో, జాప్యానికి కారణాలు ఏమిటో యాజమాన్యం కార్మికులకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.ఖబడ్దార్... కార్మిక ప్రయోజనాలపై విషప్రచారం చేస్తే ఊరుకోం,లగ్గాల అజయ్, పేరం వినోద్‌లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఐఎన్‌టీయూసీ నాయకులు ఎక్కడ గేట్ మీటింగ్‌లు నిర్వహించినా అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలపై కూడా ఆయా సమావేశాల్లో ప్రశ్నిస్తామని అదేవిధంగా ఇతర సమస్యలపై కూడా కచ్చితంగా ప్రశ్నిస్తామని తెలిపారు.“ఖబడ్దార్... ప్రభుత్వ తొత్తు సంఘాలను అడ్డుపెట్టుకుని కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలపై విషం చల్లాలని చూస్తే ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం” అని గట్టయ్య స్పష్టం చేశారు.సెప్టెంబర్ 4న జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వారిపై సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లయితే దానిపైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ