తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (EMRS) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సాధారణ కార్యకలాపాలు, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై అధికారులను అడిగి సమగ్రంగా తెలుసుకున్నారు.పాఠశాలలో గిరిజన విద్యార్థుల విద్యా అవసరాలు, పాఠ్యపుస్తకాల లభ్యత, బోధనా విధానాలు, అకాడమిక్ సపోర్ట్ వ్యవస్థపై జిల్లా కలెక్టర్ వివరంగా ఆరా తీశారు. విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, విద్యా వనరులు అందిస్తామని తెలిపారు. గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.పాఠశాలలోని క్రీడా మైదానం అభివృద్ధి, క్రీడా పరికరాల లభ్యత, విద్యార్థుల శారీరక ఆరోగ్యం, క్రీడల ద్వారా క్రమశిక్షణ పెంపొందించే అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు.అనంతరం పాఠశాల మెస్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తగిన పోషకాహారం తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, అంతర్గత రహదారులు గుంతలమయంగా ఉన్న విషయాన్ని గమనించి, వాటి అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో సన్నిహితంగా మమేకమైన జిల్లా కలెక్టర్, గిరిజన పిల్లల అభ్యుదయానికి తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిపారు. విద్యనే ఆయుధంగా చేసుకొని గిరిజన విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్, బోధన బోధనేతర సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ