తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి – గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో గురువారం నిర్వహించిన సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన పాటతో సభలో పాల్గొన్న వారందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి చేరేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించిందంటే అది పూర్వజన్మ సుకృతంగా భావించాలని అన్నారు. అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సేవే లక్ష్యంగా, ప్రజల శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పేదల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు మరింత కృషి చేయాలని తెలిపారు . తన నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పది గంటల వరకు అత్యవసర కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ ముందుగా మండలాల వారీగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించారు. సర్పంచులు, వార్డు సభ్యులకు అందజేస్తున్న శిక్షణ కిట్లు, ఐడీ కార్డులను పరిశీలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం వైద్య శాఖ ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని సందర్శించి అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. శిక్షణా కేంద్రంలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయబడిందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను చర్చించి తదుపరి కార్యాచరణపై మార్గదర్శకాలు జారీ చేశారని తెలిపారు. ఈ ఉపసంఘంలో మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారని తెలిపారు .మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ 99 రోజుల కార్యాచరణను పలు ప్రధాన అంశాల ఆధారంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్యం, పెండింగ్ సమస్యల పరిష్కారం, ఆరోగ్యం, రోడ్డు భద్రత , సంక్షేమ పథకాల అమలు, బాలల భద్రత, మాదకద్రవ్యాల నివారణ, వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై శాఖల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య కార్యక్రమాలు, ఏప్రిల్ 13 నుండి 18 వరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు, ఏప్రిల్ 20 నుండి 25 వరకు సంక్షేమ పథకాల అమలు సమీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పాఠశాలలు, కళాశాలల్లో “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు నో” అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. మే 4 నుండి 9 వరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు, మే 11 నుండి 16 వరకు విద్యా రంగంపై ప్రత్యేక సమీక్షలు, మే 18 నుండి 23 వరకు యువత మరియు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు . మే 25 నుండి 30 వరకు మహిళల సాధికారతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జూన్ 1 నుండి 12 వరకు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారుఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు కావడానికి ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.శిక్షణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలు తమ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాలు, పట్టణాల్లో అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజా ప్రతినిధులు మరియు అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించే గొప్ప కార్యక్రమమన్నారు. వివిధ శాఖల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఈ 99 రోజుల కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలో గత 27 సంవత్సరాలుగా పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని, ఇప్పుడు ఎన్నికైన కార్పొరేటర్లు ఈ 99 రోజుల కార్యాచరణను సద్వినియోగం చేసుకొని డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ కావడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ శాఖల పనితీరు, సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కార విధానాలపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాల్లో లేదా పట్టణాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఏ శాఖను సంప్రదించాలి, ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేయాలి అనే విషయాలను వివరంగా తెలియజేస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులు ఈ శిక్షణలో వివరాలు అందిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను క్లీన్ అండ్ గ్రీన్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పని చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలు, గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ తదితర శాఖలు తమ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకోవలసిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మరియు మాస్టర్ ట్రైనర్లు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి అమలు విధానం, గ్రామాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సమగ్ర సమాచారాన్ని అందించారు.ప్రజా ప్రతినిధులు శిక్షణా, సంక్షేమ పథకాలు,. తలెత్తిన సందేహాలను జిల్లా అధికారులు నివృత్తి చేశారు.ఈ కార్యక్రమం లో శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ,,ఏ డి ఏం ఏ జిల్లా నోడల్ అధికారి జోత్స్న, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ లలిత కుమారి,ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, అశ్వరావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ, ,ఆర్ డి ఓ మధు, గృహ నిర్మాణ శాఖ పి డి రవీందర్ నాథ్, వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, డి సి హెచ్ ఓ రవిబాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డి పి ఓ సుధీర్ అన్ని శాఖల జిల్లా అధికారులు నూతనంగా సర్పంచులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ