తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది.జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.– వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. జేఏసీ (ఎఐటియుసి, ఐ ఎన్ టీ యు సి, సి ఐ టి యు, హెచ్ ఎం ఎస్) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద నిర్వహించిన మహా ధర్నా, ముట్టడి కార్యక్రమం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సింగరేణి అన్ని ఏరియాల నుంచి వేలాది మంది కార్మికులు, నాయకులు భారీగా తరలివచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. "డిమాండ్ల డే"గా నిర్వహించిన ఈ పోరాట కార్యక్రమం సింగరేణి కార్మిక ఐక్యతకు, ఉద్యమ స్ఫూర్తికి మరోసారి నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కార్మికుల సహనాన్ని బలహీనతగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికులకు న్యాయంగా రావాల్సిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. వెంటనే 12వ వేజ్ బోర్డును ఏర్పాటు చేసి వేతన సవరణ పూర్తి చేయాలని, కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని స్పష్టం చేశారు.అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్న పాలకులు, అదే కార్మికులకు రావాల్సిన హక్కులను నిరాకరించడం దారుణమని మండిపడ్డారు.12వ వేజ్ బోర్డు ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించాలని, నాలుగు లేబర్ కోడ్స్ పేరుతో శ్రమ చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కార్మిక ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. అవసరమైతే సమ్మెలు, ముట్టడులు, నిరవధిక ఆందోళనలతో ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని దిగివచ్చేలా చేస్తామని హెచ్చరించారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి చరిత్రలో కార్మికులకు లభించిన ప్రతి హక్కు ఉద్యమాల ద్వారానే సాధించబడిందని గుర్తు చేస్తూ, ఈసారి కూడా కార్మికుల ఐక్యతతో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల ఐక్యశక్తి ముందు కార్మిక వ్యతిరేక విధానాలు నిలవవని, అవసరమైతే మరింత ఉధృత కార్యాచరణ చేపడతామని ప్రకటించారు.ఈ మహా ధర్నా, ముట్టడి కార్యక్రమంతో సింగరేణి కార్మిక లోకం మరోసారి తన పోరాట పటిమను చాటిచెప్పింది. "12వ వేజ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి – నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి" అనే నినాదాలతో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ పరిసరాలు మార్మోగాయి. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమ జ్వాల ఆరదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె. సారయ్య, వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగ వెంకట్ , బ్రాంచ్ కార్యదర్శులు మల్లికార్జున్, రమణమూర్తి,నజీర్ మేకల ఈశ్వర్,సుధాకర్,గట్టయ్య, ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, త్యాగరాజన్, లక్ష్మారెడ్డి, ఆల్బర్ట్, పీఠంబరం, రజాక్, సీఐటీయూ నాయకులు మంద నర్సింహారావు, రాజిరెడ్డి, విజయగిరి శ్రీనివాస్, హెచ్‌ఎంఎస్ నాయకులు కృష్ణ ప్రసాద్, ఆంజనేయులు, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్మికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ