తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం – జిల్లా కలెక్టర్ అంకిత్. సీతాయిగూడెంలో భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. గిరిజనులతో మాట్లాడి రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న కలెక్టర్ .చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, సర్వే ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పరిధిలో మొత్తం 1,823 ఎకరాలకు భూ రీ-సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇటీవల గ్రామ సభను కూడా నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో రీ-సర్వే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు.గ్రామంలో సుమారు 200 వరకు నివాసాలు ఉన్నట్లు అధికారులు వివరించగా, భూమి ఉన్నప్పటికీ పట్టాదారు పాస్‌బుక్‌లు లేని వారు, పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూమి వివరాలు సరిపోని వారు, రికార్డుల్లో భూముల వివరాలు నమోదు కాని సందర్భాలు కూడా ఉన్నట్లు తెలిపారు. భూ రీ-సర్వే పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితిని గుర్తించి, రికార్డుల్లో అవసరమైన సవరణలు చేయడంతో పాటు అర్హులైన భూహక్కుదారులకు పాస్‌బుక్‌లు పొందే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ గ్రామంలోని గిరిజనులతో నేరుగా మాట్లాడి భూ రీ-సర్వే వల్ల వారికి కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియ గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు కలెక్టర్‌కు తెలిపారు. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా భూములకు సంబంధించిన రికార్డుల సవరణలు, ఇతర ప్రక్రియలు పూర్తి చేసుకోలేకపోయిన వారికి ప్రస్తుత రీ-సర్వే ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు. పాత భూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూములను గుర్తించడం ద్వారా తమ భూ హక్కులకు మరింత స్పష్టత లభిస్తుందని గిరిజనులు పేర్కొన్నారు.గ్రామ పరిధిలో అటవీ భూములు కూడా గణనీయంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దగూడెం ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో సుమారు 5,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉండగా, సీతాయిగూడెం గ్రామ పరిధిలో సుమారు 700 నుంచి 800 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం రామవరం, చండ్రుగొండ తదితర అటవీ రేంజ్‌ల పరిధిలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత భూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించారు. సుమారు 1920ల నాటి పాత మ్యాప్‌లు, రికార్డులను పరిశీలిస్తూ అప్పటి భూముల హద్దులు, చెట్లు, కుంటలు, చెరువులు, తోటలు తదితర వివరాలను నమోదు చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన భూ హద్దు రాళ్లు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదని అధికారులు వివరించగా, భూ రీ-సర్వేలో హద్దులను స్పష్టంగా నిర్ధారించి, భవిష్యత్‌లో కూడా సులభంగా గుర్తించే విధంగా శాశ్వత హద్దు గుర్తులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.భూ రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలు తదితర అంశాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూమి ఉండి రికార్డుల్లో నమోదు కాకపోవడం, పాస్‌బుక్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూమి వివరాలు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడి భూమి వివరాలు కూడా రికార్డుల్లో తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రీ-సర్వే ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, సర్వే అధికారులు, అటవి శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ