తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీఎల్‌వోలు నమోదు చేసిన వివరాలను ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా పునః ధృవీకరణ చేయాలి ఓటరు జాబితాకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు కొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నమోదు చేసిన వివరాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున బీఎల్‌వోలు సేకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. బీఎల్‌వోలు వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నట్లు గుర్తించామని, వాటి కారణంగా అర్హులైన ఓటర్ల వివరాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బీఎల్‌వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌వోలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్‌వోలు), సూపర్‌వైజర్లు తప్పనిసరిగా పునః ధృవీకరణ చేయాలని, యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్వహించి లోపాలను మరో రెండు రోజుల్లోగా సరిదిద్దాలని ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువులో అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, సూపర్‌వైజర్లు బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తికాగా, 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ స్టేషన్‌ల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) అందజేసి, వారి నుంచి తప్పనిసరిగా రసీదు లేదా సంతకం తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రభావం ఉంటుందనే తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఓటరు జాబితా సవరణకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఖండిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, బీఎల్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్ పురోగతిని వివరించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కొనసాగుతోందని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నమోదు చేసిన ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో డిజిటలైజేషన్, ధృవీకరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను పూర్తి చేసి ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎన్నికల విభాగం సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ