తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్హత మేరకు వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే అంశాలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేదా నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రతి సమస్య వెనుక ఉన్న మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రజలు తమ వినతులతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ మున్సిపాలిటీ వనమ కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి, తమకు ఇంటి నిర్మాణ స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తదుపరి చర్యల నిమిత్తం గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఎండార్స్ చేశారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న కొండపల్లి ఉమా, తమ కుటుంబం తీవ్ర పేదరికంలో ఉందని, పదో తరగతిలో మంచి ప్రతిభ కనబరిచిన తమ కుమార్తె టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాల్వంచలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష సమయంలో అనారోగ్యానికి గురికావడంతో పరీక్షకు హాజరు కాలేకపోయిందని, తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సీటు కేటాయించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి సంబంధిత ఆర్‌సీఓకు ఎండోర్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం కోయి నర్సాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ రైతులు, కోయి నర్సాపురం గ్రామంలో సుమారు 250 ఎకరాల భూమిలో 116 మంది ఆదివాసీలు సాగు చేస్తున్నారని, తమ తాతముత్తాతలు భూమి శిస్తు కూడా చెల్లించి యున్నారని , పట్టాలు జారీ చేయాలని పేసా గ్రామసభ తీర్మానం కూడా జరిగిందని తెలిపారు. సర్వే నంబర్లు 28, 29, 52లలో సర్వే నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల కోసం దుమ్ముగూడెం తహసీల్దార్‌కు ఎండోర్స్ చేశారు. అశ్వాపురం మండలానికి చెందిన కోడి నాగరాజు, రోడ్డు ప్రమాదంలో తన ఎడమ చేయిని కోల్పోయానని, డిగ్రీ వరకు చదువుకున్నానని, జీవనోపాధి కోసం ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ